skip to main | skip to sidebar

Friday, August 19, 2011

జగన్‌ దూకుడును కట్టడి చేయడం ఎలా....



వైఎస్‌ జగన్‌ వ్యవహారంలో ఇంత ఆకస్మికంగా ముప్పేటదాడి ఎందుకు మొదలైంది.....
సీబీఐ తొలుతగా టార్గెట్‌ చేసేది జగన్‌నా.....జగన్‌తో చేతులు కలిపిన వారినా....
జగన్‌తో ఇప్పటికిపుడు తాడో పేడో తేల్చుకోవడానికి కాంగ్రెస్‌పార్టీ ఎందుకు సిధ్దపడుతోంది.....
కాంగ్రెస్‌పార్టీ క్రమంగా జూలు విదుల్చుతోంది.....కంటిలో నలుసులా మారిన వైఎస్‌ జగన్‌ వ్యవహారాన్ని అటో ఇటో తేల్చేయాలని డిసైడైంది.జగన్‌ అండ్‌ టీమ్‌ కవ్వింపు చర్యలకు దిగినా.....ఇంతకాలం సంయమనంతో ఆచితూచి అడుగులు వేసిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ పంథా మార్చుతోంది.జగన్‌ను ఢీకొనేందుకు ఇంతకు మించిన మంచి తరుణం దొరకదన్న అంచనాతో ఒడుపుగా పావులు కదుపుతోంది.వైఎస్సార్‌ వారసుడిని రాజకీయ చక్రవ్యూహంలో చిత్తు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.వైఎస్‌ మరణం తర్వాత జగన్‌కు,కాంగ్రెస్‌ హైకమాండ్‌కు మధ్య ప్రఛ్చన్నయుధ్దం సాగుతోంది.వైఎస్సార్‌ వారసుడిగా జగన్‌ను సీఎం చేయాలన్న కొందరి ప్రయత్నాలకు ఢిల్లీ అధిష్టానం గండి కొట్టడంతో ఈ చిచ్చు మొదలైంది.రోజులు గడుస్తున్నా ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోగా మరింతగా దిగజారాయి.కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న వైఎస్‌ జగన్‌ సొంతంగా పార్టీని పెట్టారు.కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను తన శిబిరంలో చేర్చుకుని పదే పదే కవ్వింపు చర్యలకు దిగారు.రాష్ట్రంలో రాజకీయంగా క్లిష్టపరిస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ బలహీనతను ఆసరాగా చేసుకుని జగన్‌టీమ్‌ చేతనైతే చర్యలు తీసుకోవాలంటూ సవాళ్లతో రెచ్చగొట్టారు.దీనితో కాంగ్రెస్‌ హైకమాండ్‌ వైఎస్‌ జగన్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని వర్కవుట్‌ చేసింది.అంతే ఉన్నంట్టుండి మంత్రి శంకర్‌రావు లేఖాస్త్రంతో హైకోర్టుకెక్కారు.కట్‌ చేస్తే హైకోర్టు ఆదేశాలతో జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు ఆగమేఘాల మీద జరుగుతోంది.అయితే జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ కనుసన్నల్లోనే జరుగుతున్నాయనేది జగన్‌ టీమ్‌ పేర్కొంటోంది.జగన్‌ దూకుడును కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌పార్టీ అంచనా వేస్తోంది.అయితే జగన్‌ను కట్టడి చేయడం ఎలా....ఎప్పుడు చేయాలన్న దానిపై కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలు తీవ్రస్థాయిలో తర్జనభర్జన చేశారు.జగన్‌పై చట్టపర చర్యలు తీసుకుంటే ప్రజల్లో సానుభూతి పెరగడమే కాకుండా కాంగ్రెస్‌పార్టీ విలన్‌గా చూస్తారేమోనన్న అనుమానాలు వారిలో వ్యక్తమయ్యాయి.అయితే ఎన్నికలకు మరో మూడేళ్ళ సమయం ఉంది కాబట్టి జగన్‌పై చర్యలకు తక్షణం దిగాలని సీమాంధ్రకు చెందిన ముఖ్యనేత,కేంద్రమంత్రి,తరచూ వివాదాల్లో నలిగే ఎంపీ.....హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.ఒకవేళ జగన్‌ను అరెస్ట్‌ చేసినా వచ్చే సానుభూతిని మరో మూడేళ్ళపాటు కొనసాగించడం సాధ్యం కాదనే వాదనను వారు వినిపించారు.అంతే కాకుండా చట్టపరచర్యలు మొదలైతే జగన్‌ వైపు వెళ్లాలనుకునే కాంగ్రెస్‌ నాయకులను అడ్డుకోవడంతో పాటు ఇప్పటికే ఆ శిబిరంలో చేరినవారిని మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేయొచ్చంటూ వారు ఢిల్లీ పెద్దల్ని ఒప్పించారనే వాదన వినవస్తోంది.అందుకే జగన్‌తో ఢీ కొనడానికే కాంగ్రెస్‌ మొగ్గు చూపింది.కేసుల జంఝాటంలో జగన్‌ కొట్టుమిట్టాడుతుండగానే సహకార,స్థానిక,మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించాలనే వాదనా కాంగ్రెస్‌పార్టీలో వ్యక్తమవుతోంది.జగన్‌ టీమ్‌ కేసులు,కోర్టులంటూ తిరుగుతుండగానే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేపట్టి కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేయాలన్న యాక్షన్‌ప్లాన్‌ను సీఎం స్థాయిలో రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది.మొత్తంమీద కాంగ్రెస్‌పార్టీ రిస్క్‌ తీసుకుని అమలు చేస్తున్న పొలిటికల్‌ స్ట్రాటజీ ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిని రేపుతోంది.

0 comments:

 

satish kamaal Copyright © 2011 | Template created by O Pregador | Powered by Blogger