skip to main | skip to sidebar

Monday, August 22, 2011

ఎందుకీ రావణకాష్టం



అక్కడ మతకలహాలు లేవు.....కులాల కుమ్ములాటలు,ఫ్యాక్షన్ పోరు జాడలే లేవు.......మావోయిస్టులమెరుపుదాడులు.....సంఘవిద్రోహశక్తుల అరాచకాలు అసలే లేవు...........అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అతలాకుతలమవుతోంది.....అగ్నిగుండంలా భగ్గుమంటోంది.....పోలీసు పహారాలో తెలుగునేల బిక్కుబిక్కుమంటోంది......శాంతి....భద్రతల గురించి ధీమాగా మాట్లాడలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.....ఎవరీ కార్చిచ్చును రాజేశారు........ఎందుకీ రావణకాష్టం అంతకంతకూ రగులుకుంటోంది.
తెలుగువారి మధ్య కక్షలూ,కార్పణ్యాల జ్వాల ఇలా మండాల్సిందేనా........
తెలంగాణ రాష్ట్రం ఇస్తారో...ఇవ్వరో తేల్చిచెప్పలేని పరిస్థితి ఎందుకు.....
రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల విషయంలో ఎందుకీ గజిబిజి.....గందరగోళం....
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రను కొత్త మలుపు తిప్పింది...కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్‌ 9 ప్రకటన.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రాంరంభిస్తున్నామని.....ఆ మేరకు అవసరమైన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామంటూ చిదంబరం చేసిన స్టేట్‌మెంట్‌ రాజకీయ సంచలనం సృష్టించింది.స్వపరిపాలన కోసం ఆరు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి రూపం వచ్చిందని తెలంగాణవాదులు చేసుకుంటున్న సంబరాలు రెండువారాల్లోనే ఆవిరైపోయాయి.సీమాంధ్ర నేతల ఒత్తిళ్ళతో డిసెంబర్‌ 9 ప్రకటనను అటకెక్కిస్తూ చిదంబరం డిసెంబర్ 23న మరో స్టేట్‌మెంట్‌ చేశారు.అప్పట్నుంచి రాష్ట్రంలో రావణకాష్టం రగులుకుంది.
అఖిలపక్షం ఏకాభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తరపున డిసెంబర్‌ 9 ప్రకటన చేసిన చిదంబరం...డిసెంబర్‌ 23 స్టేట్‌మెంట్‌ను అన్నిపార్టీల ఏకాభిప్రాయంతోనే చేశారా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సై అన్న అధికారకాంగ్రెస్‌,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ తమ తమ పార్టీల్లోని సీమాంధ్ర నేతలను ఆ మేరకు ఒప్పించడంలో ఉద్దేశపూర్వకంగా చేతులెత్తేశాయి.ఫలితంగా ఇరుప్రాంతాల మధ్య విద్వేషబీజాలు మొలకెత్తాయి....కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు,రాజకీయపక్షాల అవకాశవాదాలతో తెలుగువారు మానసికంగా నిట్టనిలువునా చీలిపోయారు.
సమస్య పరిష్కారానికి అన్ని ప్రాంతాల ప్రజలతో సంప్రదింపులు జరిపిన శ్రీకృష్ణ కమిటీ విభజన అంశాన్ని మరింత సంక్లిష్టంగా మార్చేసింది.శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కేంద్రప్రభుత్వం అఖిలపక్షభేటీ జరుపలేని పరిస్థితి నెలకొంది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల బలహీనతలను చూసిన తెలంగాణ,సీమాంధ్ర ప్రాంతాల నేతలు తమ తమ వాదాలతో మొండిగా ముందుకుసాగుతున్నారు.ఇరు ప్రాంతాల నేతల సంగతలా ఉంచితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య తన పరిష్కారాన్ని తానే వెదుక్కుంటుందన్న పీవీ నరసింహారావు పాలసీని పాటిస్తున్నాయి.
అధికారం ఎక్కడ మిస్సవుతుందో....33 ఎంపీ స్థానాలను నిలబెట్టుకుని రాహూల్‌గాంధీని సొంతబలంతో ప్రధానిని చేయడం కష్టమవుతుందేమోనని కాంగ్రెస్‌పార్టీ టెన్షన్‌ పడుతోంది.ఇప్పటికే రెండు సార్లు అధికారాన్ని మిస్సయ్యాం,ఈ ఛాన్స్‌ మిస్సయితే పార్టీ మనుగడకే ముప్పన్న ఆందోళనలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ కొట్టుమిట్టాడుతోంది.అందుకే రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్‌ చేయగలిగిన ప్రధాన పార్టీలు తమ భవిష్యత్తు కోసం అవకాశవాద ఎత్తుగడలతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.
రాజకీయనాయకులు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు......రాజనీతిజ్ఞులు రాబోయే తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దల మాట...........ఇపుడున్నదంతా రాజకీయనాయకులే...మరీ ముఖ్యంగా అవకాశవాద రాజకీయనాయకులు.......ఇటువంటివారి నాయకత్వంలో ఈ రావణకాష్టం ఇప్పట్లో చల్లారుతుందని ఆశించడం అత్యాశే అవుతుందేమో?????

0 comments:

 

satish kamaal Copyright © 2011 | Template created by O Pregador | Powered by Blogger