skip to main | skip to sidebar

Monday, August 22, 2011

సై అంటే సై

2 comments


జగన్‌ వర్గ ఎమ్మెల్యేల రాజీనామాల సంఖ్య అంతకంతకూ పెరుగుతాయా.........
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వలసలను ఆపడం సీఎం కిరణ్‌కు సాధ్యమవుతుందా......
జగన్‌ వర్గ ఎమ్మెల్యేల రిజైన్లను కాంగ్రెస్‌ లైట్‌గా తీసుకుంటోందా.......
రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.వైఎస్‌ జగన్‌ వర్గం జూలు విదిల్చింది.కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు 29 మంది జగన్‌కు మధ్ధతుగా నిల్చి,తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేశారు.ఈ రిజైన్ల ఆటుపోట్ల మధ్య కిరణ్‌ సర్కార్ నావ ఏ విధంగా ముందుకు సాగుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.జగన్‌ అలజడిని ఎదుర్కోవడంపై కాంగ్రెస్‌పార్టీలో తీవ్ర తర్జనభర్జన జరుగుతోంది........
ఎట్టకేలకు వైఎస్‌ జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టారు.కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలిచి జగన్‌తో జట్టు కట్టడం గురించి చాలా కాలంగా విమర్శలు వస్తున్నా.....పట్టించుకోని ఎమ్మెల్యేలు ఒక్కసారిగా యాక్షన్‌లోకి దిగారు.జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ దర్యాప్తు మొదలవడంతో వీరంతా అప్రమత్తమయ్యారు.అధికార దుర్వినియోగం విషయంలో వైఎస్సార్‌ పేరును సీబీఐ నివేదికలో పేర్కొనడాన్ని తప్పుబడుతూ మూకుమ్మడి రాజీనామాలతో ఝలక్‌ ఇచ్చారు.రిజైన్‌ అస్త్రాలను సంధించిన ఎమ్మెల్యేలు తమ సంఖ్య రెట్టింపు అవుతుందంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.అయితే సీబీఐ కేసులతోనో...భవిష్యత్‌ రాజకీయ అవసరాలతోనో కాంగ్రెస్‌పార్టీతో పూర్తి శతృత్వం విషయంలో జగన్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.అదే సమయంలో జగన్‌వర్గ ఎమ్మెల్యేలు మాత్రం సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు.
ఒక్కసారిగా పాతికమందికి పైగా తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా అధికార కాంగ్రెస్‌పార్టీ పెద్దగా ఆందోళన చెందలేదు.రిజైన్ల పర్యవసానాలపై ఆయా జిల్లాల మంత్రులతో సమావేశమైన సీఎం కిరణ్‌ తాజా పరిణామాలను సమీక్షించారు.ఆ తర్వాత కాంగ్రెస్‌పార్టీలో పీఆర్పీ విలీన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.....జగన్‌ వ్యవహారాన్ని తేలిగ్గా తీసిపారేశారు.
నంబర్‌గేమ్‌ కోణంలో చూస్తే జగన్‌ తనకు మధ్ధతుగా నిలిచే ఎమ్మెల్యేల సంఖ్యను 70కి చేరిస్తే తప్ప అధికార కాంగ్రెస్‌ షేక్‌ అయ్యే అవకాశాలు లేవు.ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జగన్‌ బలం మరో పది మందిని మించి పెరగదని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ప్రభుత్వ మనుగడ విషయంలో కాంగ్రెస్‌పార్టీ పూర్తి ధీమాతో ఉంది.అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడంపై మాత్రం జగన్‌ వర్గంలో స్పష్టత రావడంలేదు.మరో పదిరోజుల్లో వస్తున్న వైఎస్సార్‌ రెండవ వర్ధంతి తర్వాత మాత్రమే జగన్‌వర్గం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది తేలుతుంది.

ఎందుకీ రావణకాష్టం

0 comments


అక్కడ మతకలహాలు లేవు.....కులాల కుమ్ములాటలు,ఫ్యాక్షన్ పోరు జాడలే లేవు.......మావోయిస్టులమెరుపుదాడులు.....సంఘవిద్రోహశక్తుల అరాచకాలు అసలే లేవు...........అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అతలాకుతలమవుతోంది.....అగ్నిగుండంలా భగ్గుమంటోంది.....పోలీసు పహారాలో తెలుగునేల బిక్కుబిక్కుమంటోంది......శాంతి....భద్రతల గురించి ధీమాగా మాట్లాడలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.....ఎవరీ కార్చిచ్చును రాజేశారు........ఎందుకీ రావణకాష్టం అంతకంతకూ రగులుకుంటోంది.
తెలుగువారి మధ్య కక్షలూ,కార్పణ్యాల జ్వాల ఇలా మండాల్సిందేనా........
తెలంగాణ రాష్ట్రం ఇస్తారో...ఇవ్వరో తేల్చిచెప్పలేని పరిస్థితి ఎందుకు.....
రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల విషయంలో ఎందుకీ గజిబిజి.....గందరగోళం....
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రను కొత్త మలుపు తిప్పింది...కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్‌ 9 ప్రకటన.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రాంరంభిస్తున్నామని.....ఆ మేరకు అవసరమైన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామంటూ చిదంబరం చేసిన స్టేట్‌మెంట్‌ రాజకీయ సంచలనం సృష్టించింది.స్వపరిపాలన కోసం ఆరు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి రూపం వచ్చిందని తెలంగాణవాదులు చేసుకుంటున్న సంబరాలు రెండువారాల్లోనే ఆవిరైపోయాయి.సీమాంధ్ర నేతల ఒత్తిళ్ళతో డిసెంబర్‌ 9 ప్రకటనను అటకెక్కిస్తూ చిదంబరం డిసెంబర్ 23న మరో స్టేట్‌మెంట్‌ చేశారు.అప్పట్నుంచి రాష్ట్రంలో రావణకాష్టం రగులుకుంది.
అఖిలపక్షం ఏకాభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తరపున డిసెంబర్‌ 9 ప్రకటన చేసిన చిదంబరం...డిసెంబర్‌ 23 స్టేట్‌మెంట్‌ను అన్నిపార్టీల ఏకాభిప్రాయంతోనే చేశారా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సై అన్న అధికారకాంగ్రెస్‌,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ తమ తమ పార్టీల్లోని సీమాంధ్ర నేతలను ఆ మేరకు ఒప్పించడంలో ఉద్దేశపూర్వకంగా చేతులెత్తేశాయి.ఫలితంగా ఇరుప్రాంతాల మధ్య విద్వేషబీజాలు మొలకెత్తాయి....కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు,రాజకీయపక్షాల అవకాశవాదాలతో తెలుగువారు మానసికంగా నిట్టనిలువునా చీలిపోయారు.
సమస్య పరిష్కారానికి అన్ని ప్రాంతాల ప్రజలతో సంప్రదింపులు జరిపిన శ్రీకృష్ణ కమిటీ విభజన అంశాన్ని మరింత సంక్లిష్టంగా మార్చేసింది.శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కేంద్రప్రభుత్వం అఖిలపక్షభేటీ జరుపలేని పరిస్థితి నెలకొంది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల బలహీనతలను చూసిన తెలంగాణ,సీమాంధ్ర ప్రాంతాల నేతలు తమ తమ వాదాలతో మొండిగా ముందుకుసాగుతున్నారు.ఇరు ప్రాంతాల నేతల సంగతలా ఉంచితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య తన పరిష్కారాన్ని తానే వెదుక్కుంటుందన్న పీవీ నరసింహారావు పాలసీని పాటిస్తున్నాయి.
అధికారం ఎక్కడ మిస్సవుతుందో....33 ఎంపీ స్థానాలను నిలబెట్టుకుని రాహూల్‌గాంధీని సొంతబలంతో ప్రధానిని చేయడం కష్టమవుతుందేమోనని కాంగ్రెస్‌పార్టీ టెన్షన్‌ పడుతోంది.ఇప్పటికే రెండు సార్లు అధికారాన్ని మిస్సయ్యాం,ఈ ఛాన్స్‌ మిస్సయితే పార్టీ మనుగడకే ముప్పన్న ఆందోళనలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ కొట్టుమిట్టాడుతోంది.అందుకే రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్‌ చేయగలిగిన ప్రధాన పార్టీలు తమ భవిష్యత్తు కోసం అవకాశవాద ఎత్తుగడలతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.
రాజకీయనాయకులు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు......రాజనీతిజ్ఞులు రాబోయే తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దల మాట...........ఇపుడున్నదంతా రాజకీయనాయకులే...మరీ ముఖ్యంగా అవకాశవాద రాజకీయనాయకులు.......ఇటువంటివారి నాయకత్వంలో ఈ రావణకాష్టం ఇప్పట్లో చల్లారుతుందని ఆశించడం అత్యాశే అవుతుందేమో?????

Friday, August 19, 2011

0 comments


ఏజ్‌ డెబ్భై నాలుగు... చిరుతపులిలా పరుగులు... అవినీతిపై పోరాటంలో... ఈ దేశ యువతరానికి... నేతృత్వం వహిస్తున్న అన్నా... ఈ తరానికి నాయకత్వం వహించటంలో... సమర్థుడినే అని నిరూపించుకున్నారు. తీహార్‌ జైలు నుంచి నేరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్న అన్నాహజారే... రాజ్‌ఘాట్‌లో ఒక్కసారిగా పరుగులు పెట్టారు... దీక్షలోనే ఉన్నా... తాను అలసిపోలేదని... ఈ దేశం నుంచి అవినీతిని తరిమి తరిమి కొట్టేందుకు... తనలో సత్తా ఉందని... నవయువకుడిలా పరుగు తీసి నిరూపించుకున్నారు.అన్నా ఒక్కసారిగా పరుగు అందుకోవటం గమనించిన పోలీసులు... ఆయనతో సమానంగా పరుగు తీయలేక అవస్థలు పడటం గమనార్హం.

తనదాకా వస్తే తప్ప

0 comments



వైఎస్‌ జగన్‌ శిబిరంలో నిన్నటిదాకా కనిపించిన దూకుడు ఎందుకు మాయమైంది....
సీబీఐ దర్యాప్తు వెఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో టెన్షన్‌ను పెంచుతోందా......
అవినీతికి వ్యతిరేకంగా జగన్‌ టీమ్‌ చేసిన స్టేట్‌మెంట్స్‌లో నిజాయితీ ఎంత.....
దివంగత నేత...ప్రియతమ నాయకుడు...వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టైల్‌లో చెప్పాలంటే తనదాకా వస్తే తప్ప తత్వం బోధపడదనేది సామెత.వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఇపుడా సామెత ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది.పొలిటికల్‌ లీడర్ల వ్యవహారశైలి అవసరానికి అనుగుణంగా ఎలా మారుతుంటుందో మరోమారు నిరూపితమైంది
సీన్‌ నంబర్‌ వన్‌......రాజకీయ అవినీతిపై అంకుశంగా జన్‌లోక్‌పాల్‌ బిల్లు రూపొందించాలని పోరాడుతున్న అన్నాహజారే తీహార్‌ జైల్‌ నుంచి విడుదలయ్యారు.దీక్షాస్థలికి నవయువకుడిలా పరుగులు తీస్తూ అన్నాహజారే ముందడుగేయగానే వేలాదిగా జనం అనుసరించారు. లీడ్‌పార్ట్‌ జగన్‌ టీమ్‌ గురించి చెప్పి....మార్నింగ్‌ నుంచి గంటగంటకు నిరాటంకంగా చూపిస్తూ వస్తున్న అన్నాహజారే విడుదలను చూపిస్తున్నారేంటని అనుకోకండి....ఇక్కడ చిన్న ట్విస్ట్‌ ఉంది....అదేంటో తెలియాలంటే కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళాలి....
సీన్‌ నంబర్‌ టూ.......నాలుగు నెలల క్రితం అన్నాహజారే అవినీతిపై పోరాటానికి శ్రీకారం చుట్టారు.వారూ...వీరూ...అనే తేడా లేకుండా దేశవ్యాపితంగా......అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్‌ లీడర్స్‌తో సహా అందరూ అన్నాకు మధ్దతు తెలపడంలో పోటీ పడ్డారు.అదే సమయంలో వైఎస్‌ జగన్‌ సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అవినీతిపై పోరాటానికి నేను సైతం అంటూ రంగంలోకి దిగారు.సరాసరి అన్నాహజారే దగ్గరికెళ్లి అవినీతిపై పోరాటానికి తన శక్తిమేరకు ఉడతాసాయంగా పదివేల రూపాయల విరాళమిచ్చారు.అన్నా ఆప్‌ సంఘర్ష్‌ కరో హమ్‌ తుమ్హారా సాథ్‌ హై అంటూ గట్టి భరోసా ఇచ్చి వచ్చారు.
ఇపుడు మళ్ళీ ప్రస్తుతానికొద్దాం........వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్‌ బాటలోనే నిన్నటిదాకా మీకు చేతనైంది చేసుకోండంటూ రూలింగ్‌పార్టీకి సవాళ్లు విసిరిన నాయకులు ఒక్కసారిగా రూట్‌ మార్చారు.హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తుకు దిగడంతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు.ఓవైపుతమ అధినేత జగన్‌ సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని చెప్తున్నప్పటికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు టెన్షన్‌లోకి వచ్చేశారు.కట్‌ చేస్తే........అవినీతిపై పోరాటంలోఅన్నాహజారేకుసంఘీభావం తెలిపిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముందు రెచ్చిపోయారు.
ముందే చెప్పినట్టు తనదాకా వస్తే తప్ప తత్వం బోధపడదన్న విషయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఇపుడిపుడే అనుభవంలోకి వస్తోంది.కనీసం తాము అవినీతిపరులం కాదని రుజువు చేసుకునేదాకానైనా ఓపిక పట్టలేరా

జగన్‌ దూకుడును కట్టడి చేయడం ఎలా....

0 comments


వైఎస్‌ జగన్‌ వ్యవహారంలో ఇంత ఆకస్మికంగా ముప్పేటదాడి ఎందుకు మొదలైంది.....
సీబీఐ తొలుతగా టార్గెట్‌ చేసేది జగన్‌నా.....జగన్‌తో చేతులు కలిపిన వారినా....
జగన్‌తో ఇప్పటికిపుడు తాడో పేడో తేల్చుకోవడానికి కాంగ్రెస్‌పార్టీ ఎందుకు సిధ్దపడుతోంది.....
కాంగ్రెస్‌పార్టీ క్రమంగా జూలు విదుల్చుతోంది.....కంటిలో నలుసులా మారిన వైఎస్‌ జగన్‌ వ్యవహారాన్ని అటో ఇటో తేల్చేయాలని డిసైడైంది.జగన్‌ అండ్‌ టీమ్‌ కవ్వింపు చర్యలకు దిగినా.....ఇంతకాలం సంయమనంతో ఆచితూచి అడుగులు వేసిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ పంథా మార్చుతోంది.జగన్‌ను ఢీకొనేందుకు ఇంతకు మించిన మంచి తరుణం దొరకదన్న అంచనాతో ఒడుపుగా పావులు కదుపుతోంది.వైఎస్సార్‌ వారసుడిని రాజకీయ చక్రవ్యూహంలో చిత్తు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.వైఎస్‌ మరణం తర్వాత జగన్‌కు,కాంగ్రెస్‌ హైకమాండ్‌కు మధ్య ప్రఛ్చన్నయుధ్దం సాగుతోంది.వైఎస్సార్‌ వారసుడిగా జగన్‌ను సీఎం చేయాలన్న కొందరి ప్రయత్నాలకు ఢిల్లీ అధిష్టానం గండి కొట్టడంతో ఈ చిచ్చు మొదలైంది.రోజులు గడుస్తున్నా ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోగా మరింతగా దిగజారాయి.కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న వైఎస్‌ జగన్‌ సొంతంగా పార్టీని పెట్టారు.కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను తన శిబిరంలో చేర్చుకుని పదే పదే కవ్వింపు చర్యలకు దిగారు.రాష్ట్రంలో రాజకీయంగా క్లిష్టపరిస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ బలహీనతను ఆసరాగా చేసుకుని జగన్‌టీమ్‌ చేతనైతే చర్యలు తీసుకోవాలంటూ సవాళ్లతో రెచ్చగొట్టారు.దీనితో కాంగ్రెస్‌ హైకమాండ్‌ వైఎస్‌ జగన్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని వర్కవుట్‌ చేసింది.అంతే ఉన్నంట్టుండి మంత్రి శంకర్‌రావు లేఖాస్త్రంతో హైకోర్టుకెక్కారు.కట్‌ చేస్తే హైకోర్టు ఆదేశాలతో జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు ఆగమేఘాల మీద జరుగుతోంది.అయితే జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ కనుసన్నల్లోనే జరుగుతున్నాయనేది జగన్‌ టీమ్‌ పేర్కొంటోంది.జగన్‌ దూకుడును కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌పార్టీ అంచనా వేస్తోంది.అయితే జగన్‌ను కట్టడి చేయడం ఎలా....ఎప్పుడు చేయాలన్న దానిపై కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలు తీవ్రస్థాయిలో తర్జనభర్జన చేశారు.జగన్‌పై చట్టపర చర్యలు తీసుకుంటే ప్రజల్లో సానుభూతి పెరగడమే కాకుండా కాంగ్రెస్‌పార్టీ విలన్‌గా చూస్తారేమోనన్న అనుమానాలు వారిలో వ్యక్తమయ్యాయి.అయితే ఎన్నికలకు మరో మూడేళ్ళ సమయం ఉంది కాబట్టి జగన్‌పై చర్యలకు తక్షణం దిగాలని సీమాంధ్రకు చెందిన ముఖ్యనేత,కేంద్రమంత్రి,తరచూ వివాదాల్లో నలిగే ఎంపీ.....హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.ఒకవేళ జగన్‌ను అరెస్ట్‌ చేసినా వచ్చే సానుభూతిని మరో మూడేళ్ళపాటు కొనసాగించడం సాధ్యం కాదనే వాదనను వారు వినిపించారు.అంతే కాకుండా చట్టపరచర్యలు మొదలైతే జగన్‌ వైపు వెళ్లాలనుకునే కాంగ్రెస్‌ నాయకులను అడ్డుకోవడంతో పాటు ఇప్పటికే ఆ శిబిరంలో చేరినవారిని మానసికంగా ఉక్కిరిబిక్కిరి చేయొచ్చంటూ వారు ఢిల్లీ పెద్దల్ని ఒప్పించారనే వాదన వినవస్తోంది.అందుకే జగన్‌తో ఢీ కొనడానికే కాంగ్రెస్‌ మొగ్గు చూపింది.కేసుల జంఝాటంలో జగన్‌ కొట్టుమిట్టాడుతుండగానే సహకార,స్థానిక,మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించాలనే వాదనా కాంగ్రెస్‌పార్టీలో వ్యక్తమవుతోంది.జగన్‌ టీమ్‌ కేసులు,కోర్టులంటూ తిరుగుతుండగానే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేపట్టి కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేయాలన్న యాక్షన్‌ప్లాన్‌ను సీఎం స్థాయిలో రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది.మొత్తంమీద కాంగ్రెస్‌పార్టీ రిస్క్‌ తీసుకుని అమలు చేస్తున్న పొలిటికల్‌ స్ట్రాటజీ ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిని రేపుతోంది.

గురివింద రాజకీయాలే

0 comments


ఎమ్మార్‌ అక్రమాల తీగ లాగితే అక్రమార్కులందరి డొంకంతా కదిలిందా.......
ఎమ్మార్‌ స్కాంలో పాపభారమంతా వైఎస్‌ జగన్‌ ఒక్కడిదేనా....?
ఇదే విషయంలో తన సఛ్చీలతను నిరూపించుకునే బాధ్యత చంద్రబాబుకు లేదా.....?
అవినీతి అంశం చుట్టూ రాష్ట్రంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.గురివింద నీతిని అనుసరించే రాజకీయనాయకులు ప్రతీ అడుగులో ప్రత్యర్థులను టార్గెట్‌ చేయడంపైనే దృష్టి పెడుతున్నారు....తమపై వస్తున్న ఆరోపణల విషయాన్ని మాత్రం చాలా కన్వీనియెంట్‌గా కప్పిపెడుతున్నారు.అటు జగనైనా....ఇటు చంద్రబాబైనా...ఆ మాటకొస్తే ఏ పొలిటీషియన్‌ అయినా తమకు అవసరమైన వాదనను తీసుకుని ప్రజల్లో గందరగోళాన్ని పెంచి పోషిస్తున్నారు.తాజాగా సాగుతున్న ఎమ్మార్‌ వ్యవహారాన్నే చూస్తే...మన రాజకీయ నాయకుల అవకాశవాదం....ద్వందవైఖరులు కళ్లకు కడుతున్నాయి.
సొంతలాభం చూసుకోవడంలో మన రాజకీయనేతలు ఎంతలా ఆరితేరిపోయారో ఎమ్మార్‌ వ్యవహారాన్ని గమనిస్తే సులభంగా అర్థమవుతుంది.టీడీపీ జమానాలో మొదలైన ఎమ్మార్‌ భూసంతర్పణపై అప్పట్లో కాంగ్రెస్‌పార్టీ ఆరోపణలను గుమ్మరించింది.కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మార్‌ రీ ఎంట్రీపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.అయితే విచిత్రంగా ఎమ్మార్‌ సంస్థ అభివృధ్ది చేసిన విల్లాలను దక్కించుకోవడంలో టీడీపీ,కాంగ్రెస్‌ నాయకులు పోటీపడ్డారు.ఎమ్మార్‌లో విల్లాలు పొందిన పొలిటికల్‌ లీడర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు,ప్రభుత్వ మాజీ సలహాదారుకెవిపి రామచంద్రరావు,పీసీసీ మాజీ ఛీఫ్‌ డి.శ్రీనివాస్‌,మాజీ మంత్రులు టి.దేవేందర్‌గౌడ్‌,కోటగిరి విద్యాధరరావు,రాంరెడ్డి దామోదర్‌రెడ్డి,ప్రస్తుత మంత్రులు జె.గీతారెడ్డి,గల్లా అరుణకుమారి,ఎమ్మెల్యేలు సుధీర్‌కుమార్‌ ఉన్నారు.వీరంతా నేరుగానో తమ బంధువుల పేర్లపైనో ఈ విల్లాలను పొందారు.ప్రభుత్వంలో టీడీపీ ఉన్నా...కాంగ్రెస్‌ ఉన్నా.....పైకి ఇరు పక్షాలు ఎన్ని ఆరోపణలు గుప్పించుకున్నా ఎమ్మార్‌ ప్రాజెక్టు మాత్రం యధావిధిగా...... సాఫీగానే ముందుకుసాగింది.ఓవైపు ఎమ్మార్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు గంభీరంగా స్టేట్‌మెంట్లు ఇచ్చిన నాయకులు గుట్టుచప్పుడు కాకుండా విల్లాల రూపంలో తమ ఆస్తుల్ని పెంచుకున్నారు.ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సందర్భంగా మరోసారి పొలిటికల్‌ లీడర్లు తమ టాలెంట్‌ను తాజాగా ప్రదర్శిస్తున్నారు.ఎమ్మార్‌ వ్యవహారంలో వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్న అటు కాంగ్రెస్‌,ఇటు టీడీపీ నాయకులు చాలా చాకచక్యంగా చంద్రబాబు,కెవిపి నుంచి మొదలెట్టి మిగతా నేతల గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు.
హైకోర్టు ఆదేశాలతో సీబీఐ వైఎస్‌ జగన్‌ ప్రమేయంపై నిజాలను నిగ్గుతేలుస్తోంది.అయితే ఇక్కడే కొన్ని నైతికమైన ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.ఎమ్మార్‌ విషయంలో ఆరోపణల నిగ్గు తేలాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా లొల్లి చేస్తున్న కాంగ్రెస్‌,టీడీపీ నేతలు తమ పార్టీల నాయకుల ప్రమేయం గురించి మాత్రం నీళ్ళు నములుతున్నారు.తప్పు చేశాడు కాబట్టే జగన్‌ సుప్రీంకోర్టు నుంచి స్టే కు ప్రయత్నిస్తున్నాడని విమర్శిస్తున్న వీరంతా ఒకవేళ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదనే నమ్మకం ఉన్నపుడు తమపై విచారణకు స్వఛ్చందంగా ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఎమ్మార్‌ సంస్థ ప్రభుత్వంలోని పెద్దలను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా విధానపరమైన నిర్ణయాలు చేయించుకుందనే బలమైన ఆరోపణలున్నాయి.అది కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా...టీడీపీ సర్కార్‌ అయినా ఎమ్మార్‌ కత్తికి ఎదురులేకుండా వ్యవహారాలు నడిచాయన్నది తేటతెల్లం.హైకోర్టు ప్రాథమికంగా ఎమ్మార్‌లో అక్రమాలు జరిగాయని నిర్ధారించింది.అయినప్పటికీ తమ ఆస్తుల ఖాతాలో ఎమ్మార్‌ విల్లాలను జోడించుకున్న పొలిటికల్‌ లీడర్లు తమ సఛ్చీలతను నిరూపించుకోవడానికి సిధ్దం కాకపోవడం విశేషం.అయినా మన అత్యాశ కాకపోతే అది వైఎస్ జగనైనా...చంద్రబాబు నాయుడైనా నైతిక బాధ్యత....స్వఛ్చందంగా విచారణకు సిధ్దపడడం లాంటి వ్యవహారాలు తమ ప్రత్యర్థులకు వర్తించాలంటారు తప్ప తమకు అన్వయించుకోవాలనుకోరు.అన్నీ ఆ తాను ముక్కలే అన్నట్టు పార్టీలు వేరు కావచ్చు....వారు వేసుకునే రాజకీయలెక్కలు వేరు కావచ్చు గానీ బేసిగ్గా వారంతా పొలిటికల్‌ లీడర్లు......గురివింద రాజకీయాలే వారి రీతిగా ఉంటుంది.......ఏమంటారు.

Thursday, August 11, 2011

జగన్‌ పోరుబాటలోనే సాగుతారా......

2 comments


వైఎస్సార్‌ వారసుడు పోరుబాటలోనే ముందుకు సాగుతారా......

ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జగన్‌,కాంగ్రెస్‌పార్టీ ఒక్కటవుతాయా.......
రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు....వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించడం సంచలనం రేపుతోంది....సీబీఐ దర్యాప్తుతో జగన్‌ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందా.....అక్రమాస్తుల కేసు ఉచ్చులో చిక్కుకున్న యువనేత స్వఛ్చంగా బయటికి వచ్చే అవకాశాలున్నాయా......కాంగ్రెస్‌పార్టీతో సయోధ్య కుదుర్చుకుంటారా....సమరానికి సై అంటూ ఇదే దూకుడును కొనసాగిస్తారా......
అక్రమాస్తుల కేసు వైఎస్‌ జగన్‌ రాజకీయ భవిష్యత్తును తిరగరాస్తుందా......
మనదేశంలో రాజకీయనాయకుల అవినీతి,అక్రమాస్తుల కేసులు కొత్త కాకపోయినా.....మన రాష్ట్రానికి వచ్చేసరికి వైఎస్‌ జగన్‌ వ్యవహారం ఖచ్చితంగా భిన్నమైనదే.కాంగ్రెస్‌పార్టీతో తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచే వైఎస్‌ జగన్‌ తన పొలిటికల్‌ ఫ్యూచర్‌పై క్లారిటీతో ఉన్నారు.అక్రమాస్తుల అంశాన్ని తీసుకుని కాంగ్రెస్‌,టీడీపీ ఒక్కటిగా హైకోర్టులో కేసులు వేసినప్పుడే రాబోయే ఫలితంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సైకలాజికల్‌గా ప్రిపేరైంది.పలు సందర్భాల్లో జగన్‌ స్వయంగా ఈ విషయంపై మాట్లాడుతూ తనను జైలుకు పంపితే తల్లి విజయమ్మను ముందు నిలిపి పార్టీని నడుపుతానంటూ ప్రకటించారు.అయితే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు మొదలైనా...కాంగ్రెస్‌పార్టీ ఆఖరు నిముషం దాకా జగన్‌ను తమ దారికి తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తుందన్న వాదనలు వినబడుతున్నాయి.వైఎస్సార్‌ మరణం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి జనాకర్షణ కలిగిన నేత కరువయ్యారు.చిరంజీవి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది.అవునన్నా...కాదన్నా...వైఎస్‌ జగన్‌ లాంటి క్రౌడ్‌పుల్లర్‌ అవసరం కాంగ్రెస్‌పార్టీకి ఎక్కువగా ఉంది.ఈ పరిస్థితిని గుర్తించిన జగన్‌ కూడా కాంగ్రెస్‌ హైకమాండ్‌పై సైకలాజికల్‌ వార్‌ కొనసాగిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలున్నా...జగన్‌ వ్యవహారాన్ని తెగేదాకా తీసుకెళ్లడం లేదు.ఇదే వరసలో జగన్‌తో భవిష్యత్తులో ఎటువంటి అవసరాలు ఉంటాయో తేల్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ అధిష్టానం సైతం జగన్‌ను,జగన్‌ వర్గాన్ని నయానో భయానో తమ నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటోంది.అందుకే జగన్‌ విషయంలో కర్ర విరగకుండా పాము చావకుండా ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు.
మన దేశ చరిత్రలో రాజకీయనాయకుల అవినీతిపై సీబీఐ ఒరలో అనేక కేసులున్నాయి.అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే ఉత్తరాదిన లాలూప్రసాద్‌యాదవ్‌,ములాయంసింగ్‌యాదవ్‌,మాయావతి....దక్షిణాదిన జయలలిత,మధుకోడా లాంటి నేతలపై కోకొల్లలుగా కేసులున్నాయి. కేంద్రంలో అధికారం చలాయించే పార్టీలు అది కాంగ్రెస్‌ అయినా బీజేపీ అయినా వీరందరితో అవసరార్ధం స్నేహాలను సాగించాయి.....ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.వైఎస్‌ జగన్‌ రాబోయే రోజుల్లో సంపాదించే రాజకీయబలం.....కేంద్ర,రాష్ట్ర స్థాయుల్లో కాంగ్రెస్‌ అవసరాలకు అనుగుణంగానే సీబీఐ తదుపరి చర్యలుంటాయన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.ఇప్పటికిప్పుడున్న పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తు మాత్రం ఖచ్చితంగా వైఎస్‌ జగన్‌కు అగ్నిపరీక్షగా నిలుస్తుందనడం సుస్పష్టం.
 

satish kamaal Copyright © 2011 | Template created by O Pregador | Powered by Blogger