skip to main | skip to sidebar

Thursday, August 11, 2011

జగన్‌ పోరుబాటలోనే సాగుతారా......



వైఎస్సార్‌ వారసుడు పోరుబాటలోనే ముందుకు సాగుతారా......

ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జగన్‌,కాంగ్రెస్‌పార్టీ ఒక్కటవుతాయా.......
రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు....వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించడం సంచలనం రేపుతోంది....సీబీఐ దర్యాప్తుతో జగన్‌ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందా.....అక్రమాస్తుల కేసు ఉచ్చులో చిక్కుకున్న యువనేత స్వఛ్చంగా బయటికి వచ్చే అవకాశాలున్నాయా......కాంగ్రెస్‌పార్టీతో సయోధ్య కుదుర్చుకుంటారా....సమరానికి సై అంటూ ఇదే దూకుడును కొనసాగిస్తారా......
అక్రమాస్తుల కేసు వైఎస్‌ జగన్‌ రాజకీయ భవిష్యత్తును తిరగరాస్తుందా......
మనదేశంలో రాజకీయనాయకుల అవినీతి,అక్రమాస్తుల కేసులు కొత్త కాకపోయినా.....మన రాష్ట్రానికి వచ్చేసరికి వైఎస్‌ జగన్‌ వ్యవహారం ఖచ్చితంగా భిన్నమైనదే.కాంగ్రెస్‌పార్టీతో తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచే వైఎస్‌ జగన్‌ తన పొలిటికల్‌ ఫ్యూచర్‌పై క్లారిటీతో ఉన్నారు.అక్రమాస్తుల అంశాన్ని తీసుకుని కాంగ్రెస్‌,టీడీపీ ఒక్కటిగా హైకోర్టులో కేసులు వేసినప్పుడే రాబోయే ఫలితంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సైకలాజికల్‌గా ప్రిపేరైంది.పలు సందర్భాల్లో జగన్‌ స్వయంగా ఈ విషయంపై మాట్లాడుతూ తనను జైలుకు పంపితే తల్లి విజయమ్మను ముందు నిలిపి పార్టీని నడుపుతానంటూ ప్రకటించారు.అయితే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు మొదలైనా...కాంగ్రెస్‌పార్టీ ఆఖరు నిముషం దాకా జగన్‌ను తమ దారికి తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తుందన్న వాదనలు వినబడుతున్నాయి.వైఎస్సార్‌ మరణం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి జనాకర్షణ కలిగిన నేత కరువయ్యారు.చిరంజీవి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది.అవునన్నా...కాదన్నా...వైఎస్‌ జగన్‌ లాంటి క్రౌడ్‌పుల్లర్‌ అవసరం కాంగ్రెస్‌పార్టీకి ఎక్కువగా ఉంది.ఈ పరిస్థితిని గుర్తించిన జగన్‌ కూడా కాంగ్రెస్‌ హైకమాండ్‌పై సైకలాజికల్‌ వార్‌ కొనసాగిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలున్నా...జగన్‌ వ్యవహారాన్ని తెగేదాకా తీసుకెళ్లడం లేదు.ఇదే వరసలో జగన్‌తో భవిష్యత్తులో ఎటువంటి అవసరాలు ఉంటాయో తేల్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ అధిష్టానం సైతం జగన్‌ను,జగన్‌ వర్గాన్ని నయానో భయానో తమ నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటోంది.అందుకే జగన్‌ విషయంలో కర్ర విరగకుండా పాము చావకుండా ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు.
మన దేశ చరిత్రలో రాజకీయనాయకుల అవినీతిపై సీబీఐ ఒరలో అనేక కేసులున్నాయి.అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే ఉత్తరాదిన లాలూప్రసాద్‌యాదవ్‌,ములాయంసింగ్‌యాదవ్‌,మాయావతి....దక్షిణాదిన జయలలిత,మధుకోడా లాంటి నేతలపై కోకొల్లలుగా కేసులున్నాయి. కేంద్రంలో అధికారం చలాయించే పార్టీలు అది కాంగ్రెస్‌ అయినా బీజేపీ అయినా వీరందరితో అవసరార్ధం స్నేహాలను సాగించాయి.....ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.వైఎస్‌ జగన్‌ రాబోయే రోజుల్లో సంపాదించే రాజకీయబలం.....కేంద్ర,రాష్ట్ర స్థాయుల్లో కాంగ్రెస్‌ అవసరాలకు అనుగుణంగానే సీబీఐ తదుపరి చర్యలుంటాయన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.ఇప్పటికిప్పుడున్న పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తు మాత్రం ఖచ్చితంగా వైఎస్‌ జగన్‌కు అగ్నిపరీక్షగా నిలుస్తుందనడం సుస్పష్టం.
 

satish kamaal Copyright © 2011 | Template created by O Pregador | Powered by Blogger